15, ఏప్రిల్ 2014, మంగళవారం

సామాన్యుని కవితా స్పందన ‘రెండు జ్ఞాపకాలు’
సూరారం శంకర్
సెల్.నం.9948963141
వెల : 200/-

‘హామీ ఇస్తున్నాను
రైతుల్ని ఏమరచిన రాజ్యాలు మిగలవని
వృత్తుల్ని నిరాకరించిన సమాజాలు మిగలవని
కవుల్ని భంగపరిచిన రాజులు మిగలరని’
ఇలా ఆశావహమయిన ఎన్నో కవితల సమాహారం రెండు జ్ఞాపకాలు. కవి సూరారం శంకర్‌కి ఎన్నో కలలున్నాయి. మాన్యునివైపు నిలబడి నినదించే భావోద్రేకముంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి ఎదిగి వచ్చిన కవి గనుక కవిత్వంలో ఆవేశమూ ఆలోచనా ఒకింత కవిత్వ గుబాళింపూ ఉన్నాయి. మంచి చిత్రకారుడు గనుక బొమ్మలు వేయడంతో పాటు తన కవితల్ని చిత్రిక పట్టిన తీరు కూడా రేఖాచిత్రాన్ని వీక్షించినట్టే ఉంటుంది.
‘నువ్వెందుకూ పనికి రావని
విసిరేసిన రెండు జ్ఞాపకాలిప్పుడు
నా తోటలో రెండు గులాబీ నక్షత్రాలై
విచ్చుకున్నాయి’ ఈ పాదాల్లో కనిపించే కవితా భావుకత పాఠకుల్ని కట్టిపడేస్తుంది. ఇక జీవితం మీద కూడా సూరారం శంకర్‌కి స్పష్టత ఉంది. వర్తమాన సమాజంలో ప్రపంచీకరణ ప్రభావాలపైన కూడా శంకర్‌కి స్పష్టత ఉంది. అంతకుమించిన వ్యతిరేకత ఉంది. అంతకుమించి సెజ్‌లపైనా వ్యతిరేకతా వాటి పర్యావసనాలపైన స్పష్టతా ఉన్నాయి. సెజ్‌లపైన మూడు కవితలు రాశారు శంకర్.
పాపుల హస్తాలు చాలా పొడవు
పాలకుల హస్తాలు ఇంకా పొడవు అంటాడు
లోమల్ని గుట్టల్ని గుహల్ని
రాళ్లని రప్పల్ని
పేటెంట్‌కి గురి చేస్తున్న వాళ్లని ఏమనగలం
అంటూ దుఃఖాన్ని ప్రకటించిన కవి
‘చెమటని కాదు రక్తాన్ని కాదు
ఆత్మలు విత్తిన నేల
సెజ్‌ల దురాక్రమణకి తల్లడిల్లుమంది’ అంటూ ఆవేదన చెందుతాడు. ఆవేదనతో సరిపుచ్చకుండా ‘పారా హుషార్.. ఇప్పటికిది రైతు వీరుడి ధర్మాగ్రహం మాత్రమే. ఔను ధర్మాగ్రహం మాత్రమే’ అంటూ కాకినాడ సెజ్‌ల ఉదంతాన్ని కవిత్వం చేశాడు. ఇక కవులు కత్తులు పూయరు/శరత్తులు పూస్తారు/కవులు కబుర్లు చెప్పరు/ మనుష్యుల్ని మహాత్ముల్ని చేస్తారు అంటూ కవుల పాత్ర గురించి రాస్తాడు. వృద్ధాప్యం శాపం కాదు/ బ్రతుకు చావిడిలో అదొక ఇంద్రతాపం అన్న సూరారం శంకర్ అనుకుంటాం కాని మెట్టు కూలిపోతున్నప్పుడు/తనని తాను నిలబెట్టుకోవడమూ కష్టమేనంటాడు. కాలాలు ప్రజల కలలకు కాపలా దార్లు/ ప్రజాకంటకుల పాలనకు ఉరిత్రాళ్లు అన్న శంకర్ కొందరు కవులు ప్రవర్తించే తీరునీ నిరసించాడు. బ్లాక్‌పోయెట్రీ అంటూ దొడ్డిదారిన వెళితే/ అన్ని అవార్డులూ మనవే/ అన్ని సత్కారాలూ మనవే/ రాండీ కవిత్వం అచ్చోసుకుందాంరాండి అని పిలుపునిచ్చాడు. ఇలా రెండు జ్ఞాపకాలు కవిత్వం నిండా సామాజికతకు, సామాన్యునికి పెద్దపీట వేశారు. కాని అక్కడక్కడా నిరాశ కూడా ద్యోతకమవుతుంది.
తెలుస్తూ తెలుస్తూ
ఆరిన దీపాన్ని నేను
ఇపుడు ఎవరికీ ఏమీ కాను - అని తాత్త్వికంలో బాధపడతాడు. కవి ఆశావహమయినపుడు నిరాశని దరిచేయకూడదు. అంతేకాకుండా సూరారం అనేక ప్రక్రియలు (కవిత్వం, చిత్రలేఖనం, గజళ్లు) చేపట్టడం వల్ల ప్రతిభగలిగిన వారే అయినప్పటికీ ఆయన శక్తి వివిధ ప్రక్రియల్లోకి విభజింపబడుతోంది. కవిత్వానే్న మరింత సీరియస్‌గా స్వీకరిస్తే సూరారం శంకర్ మరింత మంచి కవిత్వాన్ని వెలువరించగలరు.
‘ఈ దేశంలో ఒక రోజు
సామాన్యుడు జెండా ఎగురవేస్తాడు
రాజులు సాల్యూట్ చేస్తారు’ అని స్పష్టమయిన అవగాహన, ఆశ ఉన్న కవి సూరారం శంకర్ వెలువరించిన రెండు జ్ఞాపకాలు చదవదగ్గ కవిత్వం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి