15, ఏప్రిల్ 2014, మంగళవారం

భిన్న పార్శ్వాల్ని స్పృశించిన ‘విభిన్న కోణాలు’

పంజాల జగన్నాథం
సెల్.నం.9948531985
యాభైకి పైగా కథలు రాసి పలు కథా సంపుటాలు వెలువరించిన పంజాల జగన్నాథం సమాజం గురించి, సామాజిక సాహిత్య ప్రభావాల గురించి అనేక అంశాల్ని విశే్లషిస్తూ రాసిన వ్యాస సంపుటి విభిన్న కోణాలు. సామాజిక అవగాహన, మంచితనం పట్ల విలువల పట్ల నిబద్ధతగల రచయితగా పేరు గడించిన పంజాల జగన్నాథం కథల్లో కాకుండా ఇతరత్రా తాను చెప్పదల్చుకున్న అంశాల్ని చక్కని వ్యాసరూపాల్లో రాశారు. వివిధ పత్రికల్లో ప్రచురితమయిన వ్యాసాల్ని క్రోడీకరించి విభిన్న కోణాలుగా పాఠకుల ముందుకు తెచ్చారు. సులభంగానూ సరళంగానూ సాగిపోయే వచనంతో ఈ వ్యాసాలు చక చకా చదివిస్తాయి.
25 వ్యాసాలతో కూడిన సంకలనం నిండా రచయితకున్న సామాజిక నిబద్ధత కనిపిస్తుంది. కొన్ని సాహిత్య అంశాలపైన రాసిన వ్యాసాలున్నాయి. కథ అంటే. అన్న వ్యాసంతో కథ సామాజిక సమస్యల్ని వ్యక్తీకరించడంతో చక్కని పాత్ర పోషిస్తుంది అంటాడు. కథా రచయితలు తీసుకోవాల్సిన దృష్టి కోణాన్ని, కథన రీతిని తనదైన అనుభవంతో వివరించారు. అలాగే కథలు ఎలా పుడతాయి అన్న వ్యాసంతో కథలకు ప్రేరణగా ఉండే అంశాల్ని క్రోడీకరించి చెప్పారు. ఇంకా కలాలకు సంకెళ్లు వ్యాసంలో రచయితలు జర్నలిస్టులపై ఉండే నిర్బంధాల గురించి రచయితలారా ఆలోచించండి అన్న వ్యాసంలో రచయితల్లో ఇగోయిజం ఉండకూడదని ఉండకూడదని చెబుతూ తన అనుభవాల్ని ఊటంకిస్తాడు. ఇక ప్రస్థుతం సర్వత్రా వినిపిస్తున్న సెజ్‌ల గురించి పంజాల జగన్నాథం మంచి వ్యాసం రాశాడు. కొలువుదీరుతున్న కృత్రిమ సెజ్ ప్రగతి అన్న ఈ వ్యాసంలో సెజ్‌ల వివరాలు సవివరంగా రాశారు. అంతే కాదు సెజ్‌ని కథాంశంగా తీసుకుని తుమ్మేటి రఘోత్తమ రెడ్డి అశువుగా చెప్పిన సెజ్ కథను తనదైన రీతిలో విశే్లషించి రాశారు జగన్నాథం ఈ సంపుటిని.
ఇక మన చుట్టూ జరుగుతున్న అనేక సంఘటనల్ని, సందర్భాల్ని విశే్లషిస్తూ తన అభిప్రాయాల్ని జోడిస్తూ పంజాల జగన్నాథం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతమెక్కడ, వృద్ధాప్యం, భ్రూణ హత్యలు, వలసలు, ఆకర్శణ మోజులో ప్రేమ సమాధి, కుల శక్తుల విస్తరణ కుల చాందసవాదం మొదలైన అనేక వ్యాసాలు రాశారు. ఫిక్షన్ రచయిత అయిన పంజాల జగన్నాథం కథా చట్రంలో ఇమడ్చలేని తన అభిప్రాయాల్ని జరుగుతున్న సంఘటనల్ని మంచి సరళమయిన వ్యాసాలుగా వెలువరించారు. సమకాలీనతను, సంస్కృతిని ప్రతిబింభించిన ఈ వ్యాసాలు యువతకు మంచి ఉపయుక్తంగా ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని వౌళిక వ్యాసాలు తాత్విక ప్రతిపాదనలతో రాస్తారని వెలువరించాలని పంజాల జగన్నాథం గారినుంచి ఆశించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి