15, ఏప్రిల్ 2014, మంగళవారం

మనిషి తనాన్ని వీచిన ‘ఇక్కడి చెట్ల గాలి’
===========================
నందిని సిధారెడ్డి
వెల : 50/-
సెల్: 9440381148


కూలుతున్న మనిషి
కుములుతున్న మనిషి
ఒకటేనా?
విక్రయశాలల నడుమ
వింత కూడలి నడుమ
వెలుగుతున్నది మనసేనా..

మనిషిని మనిషి తనాన్ని, మనసుని, మనసు పడే వేదనని వర్తమాన సమాజంలో అతలాకుతలమవుతున్న మానవ సంబంధాల్ని కవితాత్మకంగా సరళంగా ఆవిష్కరించిన కవితాసంపుటి ‘ఇక్కడి చెట్ల గాలి’. నందిని సిధారెడ్డి కవిత్వం నిండా అద్భుతమైన ఊహ, సరళత్వమూ, పల్లె జీవితపు పరిమళాలూ కనిపిస్తాయి. సీనియర్ కవి మంచి వక్తకూడా అయిన సిధారెడ్డి కవిత్వంలో మనిషిలో పరి ఆత్మీయత దగ్గరితనం నిండా పరుచుకుని ఉంటుంది. మనిషికీ మనిషికీ నడుమ/మనిషికీ భూమికీ నడుమ/్భమికీ భూమికీ నడుమ/ అసహజమైన ఈ ఫెన్సింగ్ ఏమిటి/ అని పలవరించే సిధారెడ్డి, ఈ లోపల/ గాలి రెక్కలమీద/ మనిషిని చేరుకోవాలె/ ఎవరికీ తలవంచని రేషం అద్ది/ పద్యం ఎగురవేయాలె అంటాడు. మనుషుల్ని, మమతల్ని, మనుషులున్న ప్రపంచాన్ని ప్రేమించిన కవి సిధారెడ్డి. అంతేకాదు ఆయన ఊరునీ ఊరి అనుబంధాల్ని ప్రేమించాడు. ఒకలకొకలు సాంత్వనగా నిలిచే ఊరు కావాలనుకున్నాడు. ఊరేనయం/ ఊరడిస్తది/ చదువుకోకపోయినా/ సముజాయిస్తది - అని ఊరి మమతల్ని కవిత్వం చేశాడు. ఊరునే కాదు చెరువునీ ప్రేమించాడు. చెరువొడ్డునీ కవిత్వం చేశాడు. తొలికరణం/ చెరువును రంగరించి/ ఒడ్డుని పుదిస్తలి. ఆ కడ/ కండ్లు నలుముకుంటూ/ జీవితం జిగేల్ మంటది అంటాడు. ఆ ఒడ్డు/ పొద్దున సందడి/ రాత్రి ఒంటరి అని స్పందిస్తాడు. ఆత్మ ఎగిరిపోయిన ఇంటి గురించి ఆవేదనతో ఇంటి శోకం కవిత చెప్పాడు సిధారెడ్డి. ఇంటికి ఎన్ని చేసినా ఎంత అలంకరించినా ఎందరున్నా ఆత్మ ఎగిరిపోయిన ఇల్లు/ చిన్నబోకేం చేస్తది అంటూ ఇంటిని. ఇంటెనుక కాకులు లేవు/ కొట్టంల ఎడ్లు లేవు/ పెరట్ల మంచె లేదు/ ఇల్లు చిన్నబోదా/ కట్టిన మనిషి లేక/ కనిపెట్టే బంధం లేక మనమనుకునే మనుషుల సందడి లేక / ఇల్లు చిన్న బోయింది అంటాడు. ఇక ఎవరయినా చనిపోయినప్పుడు ‘పిట్టకు పెట్టే’ కార్యక్రమాన్ని హృద్యం గా కవిత్వం చేశాడు. పొద్దుకు తొందరెక్కువ/ పొయ్యిదిగకముందే ఉరుకొస్తది అని మొదలయిన కవిత సూర్యుడు నెత్తిమీదికి చేరినా/ చుట్టాలు చెట్టు కిందికి చేరినా/ సుతులు ఆందోళనపడ్డా ఒక్క పిట్టరాదు/ పిట్ట ముట్టలేదు/ రావటానికైనా ముట్టడానికైనా పిట్టలుంటే గదా అంటాడు. ఆవేదనలోంచి పర్యావరణ ప్రమాదాల్ని చెబుతాడు. సున్నితమయిన భాషలో సంద్రమయిన కవిత్వం చెప్పే సిద్ధారెడ్డి రంగుల జీవి గురించి రాసినా, ఒంటరి దిగులు గురించి రాసినా, బంగారం పిచ్చి దంతేరస్ గురించి చెప్పినా నిండా కవిత్వం పంచుతాడు. రమణీయంగా/ రాజకీయంగా/ రాజ్యం వణికేరాగం పాడాలె అంటూ ప్రాణగానం చేసే సిధారెడ్డి జీవన సారాంశాన్ని జీవరేఖ పేర్ల ఆవిష్కరించాడు. జ్ఞాపకం కొంత/ మరుపు కొంత/ బతుకుకు రెండంచులు/ ఒక మొదలు ఒక చివర/ రెండు కొసలు కలిపేదే రేఖ’. ఆయన కవిత్వం నిండా జీవితమూ అనుభవాలూ అల్లుకుని వున్నాయి. చిక్కని కవితకి చక్కని దాఖలా ఇది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి